(శుభ తెలంగాణ హైదరాబాద్ ప్రతినిధి/కే. నరేష్ యాదవ్)నగరంలోని కీలక ప్రాంతంలో పనిచేస్తున్న ఓ మహిళా తహసీల్దార్‌పై అవినీతి, అక్రమాస్తులకు సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమెపై ఏసీబీ, విజిలెన్స్ విభాగాలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.భూ వివాదాలు, రెవెన్యూ ఫైళ్ల పరిష్కారంలో భారీ మొత్తాల్లో డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారికి సంబంధించిన భూ వ్యవహారంలోనూ లంచం డిమాండ్ చేశారనే ఫిర్యాదు ఏసీబీకి వెళ్లినట్లు తెలుస్తోంది.తనపై ఫిర్యాదులు వెళ్లిన విషయం తెలుసుకున్న అధికారిణి.. అక్రమాస్తులను సక్రమంగా చూపించుకునేందుకు చార్టెర్డ్ అకౌంటెంట్లను సంప్రదిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల సెలవు పూర్తయినా విధుల్లో చేరకపోవడం కూడా చర్చకు దారితీసింది.అయితే అధికారిణిపై వస్తున్న ఆరోపణలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఏసీబీ, విజిలెన్స్ విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.












