(నవంబర్ 18 | శుభ తెలంగాణ | జగిత్యాల జిల్లా ప్రతినిధి: జి. సాగర్)
గడువుకు రెండు రోజుల ముందే చందనం తొలగింపు పూర్తి.. 99.720 కిలోల చందనం భద్రపరిచిన అధికారులు…
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలగనుంది. మూలవిరాట్టుకు అలంకరించిన చందనాన్ని తొలగించే ప్రక్రియ నిర్ణీత గడువుకు రెండు రోజుల ముందుగానే పూర్తయింది. ఈ సందర్భంగా తొలగించిన 99.720 కిలోల చందనాన్ని ఆలయ అధికారులు భద్రపరిచారు.చందన తొలగింపు ప్రక్రియ పూర్తికావడంతో నేటి నుంచి వరుసగా 40 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనానికి అవకాశం కల్పించారు. ఈ ప్రత్యేక దర్శన కాలంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టుకు తరలివచ్చే అవకాశం ఉంది.మరోవైపు, నవంబర్ 19 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు వివిధ ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి కొండగట్టు అంజన్నకు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా భద్రాచలం సహా ఇతర ప్రముఖ దేవాలయాల ప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.40 రోజుల పాటు లభించనున్న ఈ అరుదైన నిజరూప దర్శనాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి.










