శుభ తెలంగాణ | ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి: అప్పల రాజు
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. పంట నష్టాలకు హెక్టారుకు రూ.75 వేల వరకు సాయం
దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపారాలు, పశువులు, మత్స్యకారులకు ఆర్థిక భరోసా
కేంద్రానికి ప్రాథమిక నివేదిక.. కేంద్ర బృందాన్ని పంపాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
శుభ తెలంగాణ | ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి: అప్పల రాజు
అమరావతి: అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పరిహార ప్యాకేజీని ప్రకటించింది. ప్రాణనష్టం, ఇళ్లు, వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు, పశుసంపద, మత్స్యకారుల జీవనోపాధి, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలకు జరిగిన నష్టాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అర్హులైన ప్రతి బాధితుడికి పారదర్శకంగా పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
తుపాను అనంతర సహాయక చర్యలు, నష్టాల అంచనా, పునరుద్ధరణ పనులు, పరిహారం పంపిణీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం ఈ వివరాలను వెల్లడించారు. బాధిత కుటుంబాలు తిరిగి సాధారణ జీవనం సాగించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
తక్షణ సాయం.. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు
తుపాను కారణంగా ఇళ్లలోకి వరదనీరు చేరిన కుటుంబాలకు తక్షణ సహాయంగా 25 కిలోల బియ్యం అందించనున్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా బాధిత కుటుంబాలకు కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో చక్కెర, కిలో బంగాళాదుంపలను ఉచితంగా అందించనున్నారు.
తక్షణ అవసరాల కోసం ఒక్కో కుటుంబానికి రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.3,000 వరకు ఆర్థిక సాయం ప్రకటించారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.
చిన్న వ్యాపారాలు, పరిశ్రమలకు ఆర్థిక చేయూత
తుపాను ప్రభావంతో జీవనోపాధి కోల్పోయిన చిన్న వ్యాపారులు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. చిన్న కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, సర్వీస్ షాపులకు రూ.25,000 చొప్పున, చేతివృత్తుల వారికి రూ.25,000, తోపుడు బండ్ల వ్యాపారులకు రూ.20,000 అందించనున్నారు.
పరిశ్రమల వారీగా కూడా పరిహారం నిర్ణయించారు. రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రూ.50,000, రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు రూ.1 లక్ష, రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు రూ.1.50 లక్షల చొప్పున సాయం అందించనున్నారు.
తుపానులో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ.3,000, ఆటోలకు రూ.10,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.
మత్స్యకారులకు ప్రత్యేక పరిహారం
తుపాను కారణంగా వలలు, పడవలు, చేపల చెరువులు దెబ్బతిన్న మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. పాక్షికంగా దెబ్బతిన్న వలల మరమ్మతులకు రూ.5,000, కొత్త వలల కొనుగోలుకు రూ.10,000 అందించనున్నారు.
మెకనైజ్డ్ కాని పడవలు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ.20,000, మెకనైజ్డ్ పడవలు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ.25,000 పరిహారం ఇవ్వనున్నారు. దెబ్బతిన్న చేపల చెరువుల పునరుద్ధరణకు రూ.18,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
పశుసంపద నష్టానికి పరిహారం
తుపాను కారణంగా పశువులను కోల్పోయిన రైతులు, పశుపోషకులకు కూడా ప్రభుత్వం పరిహారం అందించనుంది. ఆవు లేదా గేదె మరణిస్తే రూ.50,000, దూడకు రూ.25,000, గొర్రె లేదా మేక మరణిస్తే రూ.7,500 చొప్పున అందించనున్నారు.
కోడి మరణానికి రూ.100 చొప్పున పరిహారం ఇవ్వనుండగా, ఒక్కో లబ్ధిదారునికి గరిష్ఠంగా రూ.10,000 పరిమితి విధించారు. పశువుల షెడ్లు దెబ్బతిన్న వారికి రూ.5,000 చొప్పున సాయం అందించనున్నారు.
పంట నష్టాలకు హెక్టారుకు రూ.75 వేల వరకు
వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని బట్టి హెక్టారుకు పరిహారం ప్రకటించారు. పంటల వారీగా సాయం ఇలా ఉంది.
హెక్టారుకు రూ.75,000:
తమలపాకు పంటకు అత్యధికంగా రూ.75,000 పరిహారం ప్రకటించారు.
హెక్టారుకు రూ.35,000:
అరటి, పసుపు, యామ్, మిరప, జామ, బొప్పాయి, మామిడి, కాఫీ, యాపిల్ బేర్, సపోటా, జీడిమామిడి, డ్రాగన్ ఫ్రూట్ పంటలకు రూ.35,000 చొప్పున అందించనున్నారు.
హెక్టారుకు రూ.25,000:
పత్తి, వేరుశనగ, వరి, కూరగాయలు, టమాటా, పూలు, ఉల్లి, పుచ్చకాయ, నర్సరీ, దానిమ్మ, కొత్తిమీర పంటలకు ఈ పరిహారం వర్తించనుంది. చెరకు మొదటి పంటకు కూడా హెక్టారుకు రూ.25,000 ప్రకటించారు.
హెక్టారుకు రూ.15,000:
సజ్జ, మినుములు, పెసలు, మొక్కజొన్న, రాగి, కంది, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, జనుము, కొర్ర, సామ పంటలకు రూ.15,000 చొప్పున సాయం అందించనున్నారు.
ఆయిల్‌పామ్, కొబ్బరి చెట్లు దెబ్బతిన్న సందర్భాల్లో ఒక్కో చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం ప్రకటించారు.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ పనులను వేగవంతం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా చూడటమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, అయినప్పటికీ ఐదుగురు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మూడు రోజుల వ్యవధిలో ఎనిమిది సార్లు సమీక్షలు నిర్వహించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. తుపాను తీరం దాటిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు వివరించారు.
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించామని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
కేంద్ర సాయం కోసం నివేదిక
తుపాను వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు చంద్రబాబు వెల్లడించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరినట్లు తెలిపారు.
త్వరలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తానని, బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తానని సీఎం పేర్కొన్నారు. నష్టపోయిన చివరి వ్యక్తికి కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తుపాను కారణంగా ఇళ్లు, పంటలు, పశుసంపద, వ్యాపారాలను కోల్పోయిన ప్రజలు తిరిగి నిలదొక్కుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.










