శుభ తెలంగాణ | మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి: నాగళ్ల ప్రవీణ్ కుమార్
మేడ్చల్–మల్కాజిగిరి: చర్లపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఆనంద్‌ను కలిసి చర్లపల్లిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
చర్లపల్లి ప్రాంతంలో జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక ప్రజలు వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గడంతో పాటు, అత్యవసర సమయాల్లో ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండేందుకు పీహెచ్‌సీ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన డీఎంహెచ్‌ఓ ఆనంద్ త్వరలో చర్లపల్లి ప్రాంతాన్ని సందర్శించి, పీహెచ్‌సీ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు. అవసరమైన వివరాలను సేకరించి తదుపరి చర్యలపై పరిశీలన చేస్తామని పేర్కొన్నారు. చర్లపల్లి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.










