మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 20 ఆగస్టు (శుభ తెలంగాణ ప్రతినిధి / ఎన్. ప్రవీణ్ కుమార్): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కల్తీ మసాలా తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు, ఆహార భద్రతా పర్యవేక్షణ బృందాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. మేడిపల్లి శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ఓ మసాలా తయారీ కేంద్రంలో తనిఖీలు చేపట్టగా పలు అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తనిఖీల్లో అపరిశుభ్ర పరిస్థితుల్లో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. కారం పొడిలో పెద్ద మొత్తంలో చెక్కపొడి కలిపినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ బ్రాండ్‌ను పోలిన ప్యాకెట్లలో ఉత్పత్తులను ప్యాకింగ్ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ దాడుల్లో సుమారు 10,890 కిలోల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ దాదాపు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
కల్తీ మసాలాల తయారీ, విక్రయాలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.












