ఉప్పల్ నియోజకవర్గ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
హైదరాబాద్ 19ఆగస్టు (శుభ తెలంగాణ ప్రతినిధి /కే.నరేష్ యాదవ్ )ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కుషాయిగూడ ఎక్స్ రోడ్స్, రాధికా ఎక్స్ రోడ్స్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు రెండు ఫ్లైఓవర్లను నిర్మించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కుషాయిగూడ, రాధికా ఎక్స్ రోడ్స్ ప్రాంతాలు ఈసీఐఎల్, కీసర, నాగారం తదితర ప్రాంతాలకు ప్రధాన అనుసంధాన కేంద్రాలుగా ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణీకరణ వేగంగా పెరగడంతో పాటు వాహనాల రాకపోకలు అధికమవుతున్న నేపథ్యంలో ఈ రెండు కూడళ్ల వద్ద ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందన్నారు.
రద్దీ సమయాల్లో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారని, దీనివల్ల సమయం, ఇంధనం వృథా కావడంతో పాటు వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతోందని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రమాదాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.
కుషాయిగూడ ఎక్స్ రోడ్స్ వద్ద ఒక ఫ్లైఓవర్, రాధికా ఎక్స్ రోడ్స్ వద్ద మరో ఫ్లైఓవర్ నిర్మించేందుకు అవసరమైన అనుమతులు, నిధులను త్వరితగతిన మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు.
ఈ రెండు ఫ్లైఓవర్లు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుందని, కీసర, నాగారం, కుషాయిగూడ, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల దీర్ఘకాలిక రవాణా సమస్యకు పరిష్కారం చూపే ఈ కీలక ప్రాజెక్టులను ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












