(హైదరాబాద్/శుభ తెలంగాణ) సైబరాబాద్ సీపీ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.బీఆర్‌ఎస్ నాయకులు హరీష్ రావు,వేముల ప్రశాంత్ రెడ్డి,పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి,శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ ఉద్రిక్తతలు,కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ విడుదలపై బీఆర్‌ఎస్ నేతల నిరసనల కారణంగా చెలరేగాయి.గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని,గాంధీని అరెస్టు చేయకపోతే కోర్టులో సవాలు చేస్తామని హరీష్ రావు ప్రకటించారు.తాజాగా,గాంధీ అనుచరులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేసి,కోడి గుడ్లు,టమాటాలు విసిరారు.ఆ తరువాత,బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడి చేసి, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు.గాంధీ రాకను అడ్డుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకోగా, ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
దీనిపై నిరసనగా,బీఆర్‌ఎస్ నేతలు సీపీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.వారు తమ డిమాండ్లకు పరిష్కారం లభించేవరకు అక్కడే ఉంటామని,దాడి దాడి జరుగుతుంటే చూస్తూ ఉన్న సిఐ,ఎస్ఐ,ఏసిపిలను వెంటనే సస్పెండ్ చేయాలని,అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేస్తూ వాహనాల్లో తరలించారు.ఈ క్రమంలో,హరీష్ రావును లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన కిందపడిపోయారు,ఆయన చేతికి గాయమైనట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.