(శుభ తెలంగాణ/హైదరాబాద్)తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) తన దూకుడును గణనీయంగా పెంచింది. 2024 జనవరి నుండి ఆగస్టు వరకు కేవలం 8 నెలల వ్యవధిలోనే ఏసీబీ 145 అవినీతి మరియు లంచం కేసులను నమోదు చేయడం జరిగింది, ఇందులో 109 మంది అవినీతిపరులను అరెస్టు చేశారు. ఈ అరెస్టుల్లో 30 మంది రెవిన్యూ శాఖలో పని చేసే అధికారులు, 21 మంది హోం శాఖ ఉద్యోగులు, 18 మంది మున్సిపల్ శాఖకు చెందిన లంచగొడులు ఉన్నారు. అవినీతి నిరోధక శాఖ ఈ కాలంలో అవినీతిపరులపై మరింత కఠినంగా వ్యవహరించినట్లు ఏసీబీ మాజీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ తెలిపారు.
గత నాలుగేళ్లలో కేవలం 100 కేసులు మాత్రమే నమోదు చేయబడగా, ఈ 8 నెలలలోనే 145 కేసులు నమోదు కావడం అవినీతి వ్యతిరేక పోరాటంలో గణనీయమైన పురోగతిని సూచిస్తోందని ఆయన వివరించారు. ప్రజలు అవినీతి నిరోధక శాఖపై మరింత విశ్వాసం పెంచుకుని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయడం వలన కేసుల సంఖ్య ఈ విధంగా పెరిగినట్లు ఆయన వ్యాఖ్యానించారు.
సమీప కాలంలో అవినీతి ఫిర్యాదులు భారీగా పెరగడంతో, అవినీతి నిరోధక శాఖకు సిబ్బంది అవసరం కూడా మరింత పెరిగిందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.