E-PAPER

తెలంగాణకు కాబోయే తదుపరి ముఖ్యమంత్రి తానేనని బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

తెలంగాణకు కాబోయే తదుపరి ముఖ్యమంత్రి తానేనని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని రేవంత్‌ రెడ్డి తరచూ వ్యాఖ్యానిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే తదుపరి సీఎం నేనేనని ప్రకటించడం కలకలం రేపింది. అయితే ఆ ఎమ్మెల్యే ప్రకటించింది మాత్రం 2028 ఎన్నికల్లో తదుపరి సీఎం తానేనని స్పష్టత ఇవ్వడంతో కొంత గందరగోళానికి తెరపడింది. ఆ ఎమ్మెల్యేనే కేవీ రమణారెడ్డి. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల విషయమై ఇప్పుడు ప్రస్తావించారు.

 

కామారెడ్డిలో జరుగుతున్న పరిణామాలపై రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను తాను ఉండగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అయిన షబ్బీర్‌ అలీకి అధికారులు ప్రాధాన్యం ఇస్తుండడంపై తప్పుబట్టారు. ప్రొటోకాల్‌ విషయంలో గందరగోళం ఏర్పడుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు కాకుండా పార్టీ నాయకుడు షబ్బీర్‌ అలీకి గౌరవ మర్యాదలు ఇస్తుండడాన్ని తప్పుబట్టారు. కామారెడ్డిని షబ్బీర్‌ అలీకి రేవంత్‌ రెడ్డి రాసిచ్చాడా అని నిలదీశారు. ‘2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏర్పడే ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిని అవుతా. విడిచిపెట్టేదే లేదు. ఇది నా ఛాలెంజ్‌’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, నేటి రేవంత్‌ రెడ్డిని కామారెడ్డిలో కేవీ రమణా రెడ్డి ఓడించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. ఈ క్రమంలోనే కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించిన ఆయన స్థానికంగా జరుగుతున్న పరిణామాలను తప్పుబడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తనకన్నా కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీకి అధికార యంత్రాంగం ప్రాధాన్యం ఇస్తుండడంతో రమణా రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. ప్రొటోకాల్‌ పాటించరా అంటూ నిలదీశారు. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :