(మహబూబాబాద్, శుభ తెలంగాణ ప్రతినిధి: కే. రవికిరణ్)
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్ ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహబూబాబాద్ కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా.. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
చింతపల్లి వద్ద కారులో మంటలు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాంచంద్ర నాయక్ తన కారులో మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో చింతపల్లి వద్దకు చేరుకోగానే కారులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమైంది.
ఆ వెంటనే కారులోని పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్‌లో మంటలు వేగంగా వ్యాపించినట్లు సమాచారం. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే, ఆయన సిబ్బంది వెంటనే కారును నిలిపివేసి బయటకు దిగారు.
డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా.. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరి వెళ్లారు.
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగిన విషయం తెలియడంతో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పవర్ బ్యాంక్ పేలడంతోనేనా?
ప్రాథమిక సమాచారం ప్రకారం కారులోని పవర్ బ్యాంక్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.












