(శుభ తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: కే. నరేష్ యాదవ్)
తెలంగాణలో 22-A భూముల వివాదం రాజకీయంగా వేడెక్కుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ భూ వ్యవహారాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు.
22-A భూముల వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ అవసరమా? లేదా? అనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయిస్తారని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వ్యవహారాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం అభినందనీయమన్నారు.
‘ఉద్యమకారులు నష్టపోయారు..’
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది పోరాటాలు చేసి సర్వం కోల్పోయారని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబం భూములను కొల్లగొట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వ భూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
22-Aపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య విమర్శలు
22-A భూముల అంశంపై బీఆర్‌ఎస్ ఇప్పటికే జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో 22-A భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
పార్టీ వ్యవహారాలపైనా స్పందన
తన పదవీకాలానికి ఇంకా ఏడాది సమయం ఉందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలా? వద్దా? అనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయిస్తారని చెప్పారు.
పార్టీలో పెండింగ్‌లో ఉన్న పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
రెండేళ్లలో పార్టీ బలోపేతం చేశాం
టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశామని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్ నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత పురోగతిని అధిష్టానం పెద్దలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చినట్లు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు.












