రూ. 2,000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం నాడు రూ. 2,000 నోట్లను మార్చుకునే లేదా డిపాజిట్ చేసే సదుపాయం ఏప్రిల్ 1న మూసివేయనున్నట్లు ప్రకటించింది.
ఆర్‌బీఐకి చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం నుంచి నోట్లు తీసుకోవడం ప్రారంభమవుతుంది.
“రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19 ఇష్యూ కార్యాలయాల్లో ఖాతాల వార్షిక ముగింపుకు సంబంధించిన కార్యకలాపాల కారణంగా రూ. 2,000 నోట్ల మార్పిడి/డిపాజిట్ సౌకర్యం ఏప్రిల్ 1, 2024న అందుబాటులో ఉండదు” అని ఆర్బీఐ పేర్కొంది. మే 19, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2,000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను చెలామణి నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 29 నాటికి, రూ.2,000 నోట్లలో దాదాపు 97.62 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఈ నోట్లలో కేవలం రూ.8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల మధ్య చెలామణిలో ఉన్నాయి.
వ్యక్తులు తమ రూ. 2,000 నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 19 RBI కార్యాలయాల్లో దేనినైనా డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.ప్రజలు ఈ నోట్లను భారతదేశంలోని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా RBI ఇష్యూ కార్యాలయాలకు ఈ నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపే అవకాశం కూడా ఉంది. ఈ నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు, సంస్థలు సెప్టెంబర్ నాటికి వాటిని మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
గడువు తర్వాత అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించారు. బ్యాంక్ శాఖలలో డిపాజిట్, మార్పిడి సేవలు అక్టోబర్ 7న నిలిపివేశారు. అక్టోబర్ 8, 2023 నుంచి అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్‌తో సహా భారతదేశంలోని వివిధ నగరాల్లో విస్తరించి ఉన్న 19 RBI కార్యాలయాల్లో వ్యక్తులు కరెన్సీని మార్చుకోవచ్చు లేదా వారి బ్యాంక్ ఖాతాలకు సమానమైన విలువను జమ చేసుకోవచ్చు. చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం ఆర్బీఐ కార్యాలయాల్లో కూడా నోట్లు మార్చుకోవచ్చు.