ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రస్తుత ఐపీఎల్ (IPL 2024) కోసం భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంపై ప్రశంసలు కురిపించిన పీటర్సన్ తాజాగా హైదరాబాద్ విమానాశ్రయం చూసి ముగ్ధుడయ్యాడు.
శంషాబాద్ విమానాశ్రయం నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత ఐపీఎల్‌కు పీటర్సన్ కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పలు మ్యాచ్‌ల కోసం భారత నగరాల్లో తిరుగుతున్నాడు (Hyderabad International Airport).
బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ (SRH vs MI) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం పీటర్సన్ హైదరాబాద్ వచ్చాడు. ఆ క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయం చూసి ఫిదా అయ్యాడు. “మరొక రోజు.. మరొక విమానాశ్రయం. ఈ సారి నా స్నేహితులతో హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చా. ఇది మరొక అద్భుతమైన విమానాశ్రయం. ప్రపంచంలోని పలు గొప్ప విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడి టెక్నాలజీ, పరిశుభ్రత, షాపింగ్, ఫ్రెండ్లీ నేచర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయ“ని పీటర్సన్ ట్వీట్ చేశాడు.
ప్రపంచంలోని విమానాశ్రయాలు, అతి పెద్ద విమానాశ్రయాల్లో హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ఆరంభంలో ఏవియేషన్ ఎనలటిక్స్ విడుదల చేసిన జాబితాలో ఈ రెండు విమానాశ్రయాలు ఉత్తమ స్థానాలు సంపాదించాయి.