లంచం కేసులో అరెస్టైన అధికారులపై ఏసీబీ సోదాలు.. రూ.15.5 లక్షల నగదు, 27.5 తులాల బంగారం స్వాధీనం..
(శుభ తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: కే. నరేష్ యాదవ్)
మేడ్చల్, సెప్టెంబర్ 19: లంచం కేసులో అరెస్టైన కీసర సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్‌రెడ్డికి సంబంధించిన ఇళ్లలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారం, భూములు, ప్లాట్లకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. గురువారం రాత్రి వరకు కొనసాగిన తనిఖీల్లో ఇరువురి ఇళ్ల నుంచి మొత్తం రూ.15.5 లక్షల నగదు, 27.5 తులాల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
రూ.5 లక్షల లంచం కేసులో అరెస్ట్
కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసి, ముందుగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీఐ ఆంజనేయులు సూచన మేరకే ఎస్ఐ లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేశారు.
సీఐ ఇంట్లో నగదు, బంగారం
ఎల్బీనగర్–మన్సూరాబాద్‌లోని సీఐ ఆంజనేయులు నివాసంలో రూ.5 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. చంపాపేటలోని మహేశ్ బ్యాంకు లాకర్లో బంగారు ఆభరణాలు, స్థలాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారని అధికారులు పేర్కొన్నారు. ఆ లాకర్‌ను కూడా పరిశీలించాల్సి ఉందని తెలిపారు.
ఎస్ఐ ఇంట్లో రూ.10.90 లక్షలు
బోడుప్పల్‌లోని ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి ఇంట్లో రూ.10.90 లక్షల నగదు, 15.5 తులాల బంగారు ఆభరణాలు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అదనంగా జనగామ జిల్లా నర్మెట్ట, వనపర్తి జిల్లా కేంద్రం, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాల్లో మొత్తం 5.05 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నాలుగు ప్లాట్ల పత్రాలు స్వాధీనం
సిద్దిపేట జిల్లా దుద్దెడ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెములలో మొత్తం రూ.31 లక్షల విలువైన నాలుగు ఇళ్ల ప్లాట్లకు సంబంధించిన పత్రాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఆస్తుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.











