భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు.. ఆలయ పవిత్రత, చారిత్రక ప్రాశస్త్యానికి భంగం కలగకుండా పనులు..
శుభ తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: కే. నరేష్ యాదవ్: ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. త్వరలోనే మల్లూరు క్షేత్రంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నట్లు తెలిపారు.
క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆలయ అభివృద్ధి పనుల డిజైన్‌ను ఖరారు చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆలయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా..
ఆలయ పవిత్రత, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యానికి ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సీతక్క సూచించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు.
రాక్ టెస్ట్ తర్వాత తదుపరి నిర్ణయాలు
నిర్మాణ పనులు ప్రారంభించే ముందు రాక్ టెస్ట్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. రాక్ టెస్ట్ నివేదిక ఆధారంగా నిర్మాణానికి సంబంధించిన తదుపరి సాంకేతిక అంశాలను ఖరారు చేయనున్నారు. ఆలయ అభివృద్ధిలో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.











