ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ…
నిద్రపోతున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు..
ప్రైవేట్ ఆస్పత్రులపై విచారణ ఎప్పుడు..
పైసలు ఉంటేనే వైద్యం.. లేదంటే చోద్యం!
కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కమిషన్లు, అవసరం లేని చికిత్సలు, భారీ బిల్లుల వసూలు…
*(శుభ తెలంగాణ ప్రత్యేక కథనం | హైదరాబాద్ | సెప్టెంబర్ 10 | కే. నరేష్ యాదవ్)*
ప్రాణాలను కాపాడాల్సిన వైద్యం.. కొన్ని చోట్ల వ్యాపారంగా మారుతోందా? రోగి అనారోగ్యం, అతని భయం, కుటుంబ సభ్యుల ఆందోళననే పెట్టుబడిగా చేసుకుని చికిత్స పేరుతో భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తెలంగాణలో తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నాణ్యమైన వైద్యం అందించాల్సిన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగి ఆరోగ్యం కంటే బిల్లు, చికిత్స కంటే టార్గెట్, సేవ కంటే కమిషన్‌కు ప్రాధాన్యం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని చిన్న ఆసుపత్రుల్లో రోగి అసలు సమస్యకు సరైన చికిత్స అందించకుండా పరిస్థితి మరింత తీవ్రమయ్యేలా చేసి, ఆ తర్వాత పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడికి వెళ్లిన తర్వాత “వెంటనే చికిత్స చేయాలి”, “ఆలస్యం అయితే ప్రమాదం” అంటూ రోగి కుటుంబ సభ్యులను భయపెట్టి, మొదట చెప్పిన ఖర్చు క్రమంగా వేల నుంచి లక్షల రూపాయలకు పెంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ రిఫరల్స్ వెనుక డ్రైవర్లు, మధ్యవర్తులు, రిఫర్ చేసే వ్యక్తులు, ఆసుపత్రి యాజమాన్యాల వరకు కమిషన్ వ్యవస్థ కొనసాగుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
మరో తీవ్రమైన ఆరోపణ ఏమిటంటే.. కొన్ని సందర్భాల్లో వైద్యులకు రోగికి ఉన్న అసలు సమస్య తెలిసినా వెంటనే స్పష్టంగా చెప్పకుండా 10 నుంచి 15 రోజుల వరకు ఆసుపత్రిలో ఉంచి ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇస్తూ చికిత్స కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చివరకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బిల్లు వేసి, బిల్లు చెల్లించిన తర్వాత అసలు వ్యాధికి మరో వైద్యుడిని సంప్రదించమని చెప్పే పరిస్థితులు ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. నిజంగా రోగికి అంతకాలం అడ్మిషన్ అవసరమా? ప్రతి రోజు ఇచ్చే చికిత్స, ప్రతి పరీక్ష అవసరమేనా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలి.
కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసిన వెంటనే ఆపరేషన్ చేయకపోతే కిడ్నీ దెబ్బతింటుందని, ఆలస్యం అయితే ప్రమాదమని భయపెట్టి వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి కిడ్నీ స్టోన్‌కు ఒకే విధమైన చికిత్స అవసరమా? రోగికి ఇతర చికిత్సా మార్గాలను, పరిస్థితి తీవ్రతను, ఆపరేషన్ అవసరాన్ని స్పష్టంగా వివరించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే తరహాలో అపెండిక్స్, ప్రమాద కేసులు, గైనకాలజీ సమస్యలు, ప్లేట్‌లెట్స్ తగ్గడం, రక్తం తక్కువగా ఉందని చెప్పడం, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు వంటి సందర్భాల్లోనూ “వెంటనే అడ్మిట్ కావాలి”, “తక్షణ చికిత్స అవసరం” అంటూ రోగి కుటుంబ సభ్యులను భయపెట్టి నిర్ణయం తీసుకునేలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
వైరల్ ఫీవర్ వంటి కేసుల్లో కూడా వారం నుంచి రెండు వారాల వరకు ఆసుపత్రిలో ఉంచి, వరుసగా పరీక్షలు, మందులు, ఇంజెక్షన్ల పేరుతో బిల్లులు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరం లేని టాబ్లెట్లు ఇవ్వడం, తరచూ మందులు మార్చడం, పదేపదే పరీక్షలు చేయించడం, చికిత్సను కొనసాగిస్తూ బిల్లును ఒక నిర్దిష్ట టార్గెట్‌కు తీసుకెళ్లడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వైద్య నిర్ణయం రోగి ఆరోగ్యాన్ని బట్టి ఉండాలా? లేక ఆసుపత్రి బిల్ టార్గెట్‌ను బట్టి ఉండాలా? అన్నదే అసలు ప్రశ్న.
కొన్ని ఆసుపత్రుల్లో తమకు అనుబంధంగా ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్లలోనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బయట తక్కువ ధరకు పరీక్ష అందుబాటులో ఉన్నప్పటికీ నిర్దిష్ట సెంటర్‌కే పంపడం వెనుక కమిషన్ వ్యవహారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీల్లో జనరిక్ మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. కొన్ని ఆసుపత్రుల్లో ఉదయం అర్హత కలిగిన వైద్యులు ఉండి, రాత్రి వేళల్లో ఆర్‌ఎంపీ తరహా లేదా తగిన వైద్య అర్హతలపై ప్రశ్నలు ఉన్న వ్యక్తులు రోగులను చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో రోగిని చూసే వ్యక్తికి తగిన అర్హతలు ఉన్నాయా? ఆసుపత్రిలో ప్రతి సమయంలో సరైన వైద్య పర్యవేక్షణ ఉందా? అనే విషయాలపై స్పష్టత అవసరం.
కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలకు రాజకీయ పలుకుబడి ఉందని, అధికారులపై ప్రభావం చూపుతున్నారని, డబ్బుల వ్యవహారాల కారణంగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ఆసుపత్రి యాజమాన్యాలు స్పష్టంగా చెప్పాలి. రాజకీయ లేదా ఆర్థిక ప్రభావం ఏదైనా ఉన్నా ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో చట్టం ఒకే విధంగా అమలు కావాల్సిందే.
తెలంగాణలో ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న వైద్య సదుపాయాలు, వైద్యుల అర్హతలు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవలు, పరికరాలు, అత్యవసర సదుపాయాలు వంటి అంశాలను ప్రభుత్వం క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఆసుపత్రి సదుపాయాలు, సేవల స్థాయికి అనుగుణంగా పారదర్శక ధరల వ్యవస్థ ఉండాలి. రోగికి చికిత్సకు ముందు ఖర్చు, చికిత్స సమయంలో జరిగే అదనపు ఖర్చులు, చివరి బిల్లు వంటి వివరాలు స్పష్టంగా తెలియాలి. అధిక వసూళ్లు లేదా నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలి.
కమిషన్ల కోసం అవసరం లేని పరీక్షలు, మందులు, చికిత్సలు లేదా శస్త్రచికిత్సలు సూచిస్తున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత వైద్య నియంత్రణ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరించాలి. అవసరమైతే లైసెన్స్‌పై చర్యలు, వృత్తిపరమైన చర్యలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానం తీసుకురావాలి. వైద్యం పేరుతో రోగిని దోపిడీ చేసే పరిస్థితికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
వైద్య విద్య, వైద్య వ్యవస్థ అభివృద్ధిలో సమాజం మరియు ప్రభుత్వ వనరుల పాత్ర ఉన్నప్పుడు వైద్యులపై సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. తెలంగాణలో ఎంతోమంది వైద్యులు నిజాయితీగా, అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. అయితే కొందరి వాణిజ్య ధోరణి మొత్తం వైద్య రంగానికే చెడ్డపేరు తెస్తోంది. అవసరం లేని ఆపరేషన్లు, మందులు, పరీక్షలు లేదా నిర్లక్ష్య చికిత్స వల్ల రోగి ఆరోగ్యం దెబ్బతింటే దానికి బాధ్యత ఎవరిది? వైద్య నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్న ఘటనలపైనా సమగ్ర విచారణ అవసరం.
ప్రజలు కూడా వైద్యులను ప్రశ్నించడానికి భయపడకూడదు.
“ఈ పరీక్ష ఎందుకు?”..
“ఈ మందు ఎందుకు?”
“ఈ ఆపరేషన్ ఎందుకు?”
“ఇంత బిల్లు ఎందుకు?”
“మరో వైద్యుడి అభిప్రాయం తీసుకోవచ్చా?”
అని అడిగే హక్కు రోగికి ఉంది.ఎవరినైనా ప్రశ్నించినప్పుడే నిజం ఏంటో తెలుస్తుంది.ప్రాణాలను కాపాడాల్సిన వైద్యం.. ప్రాణభయాన్ని క్యాష్ చేసుకునే వ్యాపారంగా మారకూడదు. రోగి కోసం ఆసుపత్రి ఉందా.. లేక ఆసుపత్రి కోసం రోగి ఉన్నాడా ?
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రభుత్వం స్పందించేదెప్పుడు?
గత ప్రభుత్వ హయాంలోనూ ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినప్పటికీ, వాటిపై సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అయినా స్పందించి, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపి, తప్పులు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అవసరం లేని చికిత్సలు, అధిక బిల్లులు, కమిషన్ల వ్యవహారాలు, నిబంధనల ఉల్లంఘనలు వంటివి నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.












