అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో బాల్టీమోర్ నగరంలో మంగళవారం (మార్చి 26) ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్‌లోని పటాప్‌స్కో నదిపై నిర్మించిన బ్రిడ్జిని సరుకుతో వెళ్తున్న భారీ నౌక ఢీ మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది.
దీంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్‌ను నౌక ఢీకొట్టడంతో వంతెన కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు నదిలో గల్లంతయ్యారు. వంతెనను ఢీకొట్టింది సింగపూర్‌కు చెందిన సినెర్జీ మెరైన్ గ్రూప్‌నకు చెందిన ‘డాలీ’ అనే నౌక వాహన కంటైనర్‌లతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అదుపుతప్పి నదిపై నిర్మించిన ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని వేగంగా ఢీ కొట్టడంతో వంతెన కూలిపోయింది. అదే సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనదారులు నదిలో పడి గల్లంతయ్యారు. బాధితుల్లో ఇద్దరిని సహాయ సిబ్బంది వెలికితీయగలిగారు. దాదాపు 20 మంది నీటమునిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బ్రిడ్జిపై గుంతలు పూడుస్తున్న మరో ఆరుగురు సిబ్బంది కూడా నదిలో పడిపోయారు.
నౌకలో ఇద్దరు పైలెట్లు సహా 22 మంది సిబ్బంది ఉన్నారు. వారందరూ భారతీయులేనని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో నదిలో 15 మీటర్ల లోతు ఉంది. నీరు చాలా చల్లగా ఉండటంతో నదిలో గల్లంతైన వారంతా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 2.6 కిలోమీటర్ల మేర బ్రిడ్జి కుంగి పోయింది. కొంత భాగం కూలిపోయింది. ఇక నైకలోనూ మంటలు చెలరేగి దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కప్పేసింది. ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో బ్రిడ్జిపైకి వాహనాలు అనుమతించకుండా అధికారులు హుటాహుటీన చర్యలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు యాక్షన్ సీన్‌ను తలపించేలా ఉందని బాల్టీమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ వ్యాఖ్యానించారు.
అమెరికా తూర్పు తీరంలో అత్యంత బిజీ ఓడరేవుల్లో బాల్టీమోర్ ఒకటి. ప్రస్తుత ప్రమాదం నేపథ్యంలో కొంతకాలం నౌకల రాకపోకలు స్తంభించనున్నాయి. గతేడాది బాల్టీమోర్ రేవు గుండా ఏకంగా 5.2 కోట్ల టన్నుల సరుకు రవాణా చేశారు. అలాగే దాదాపు 5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించారు. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరలో పోర్టుకు నౌకల రాకపోకలను పునరుద్ధరిస్తామని తెలిపారు.