E-PAPER

ఏపీలో వాలంటీర్లకు ఈసీ షాక్.. 30 మంది విధుల నుంచి ఔట్..!

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు కోడ్‌ను కఠినంగ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది.

తాజాగా, కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో 11 మంది వాలంటీర్లపై వేటు పడింది. మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ నెల 17న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఆ విషయం నిర్ధారణ కావడంతో వాలంటీర్ల తొలగింపుపై మైలవరం ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు.

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోనూ నలుగురు వాలంటీర్లను తొలగించారు. వీరు వైసీపీ కండువాలు, టోపీలు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు తేలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉణదుర్రులో 9 మంది వాలంటీర్లపై చర్యలు తీసుకున్నారు. వైసీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. అటు, పల్నాడు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మైదవోలు వీఆర్ఎపై వేటు వేశారు. వీఆర్ఎ నాగేశ్వరరావు వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్నట్టు నిర్ధారణ కావడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. సత్యసాయి జిల్లాలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న కదిరి ప్రభుత్వ పాఠశాల సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ను, వుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రామాంజనేయులును సస్పెండ్ చేశారు.

వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 30 మంది వాలంటీర్లను ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని పలుచోట్ల ఆదేశాలిచ్చారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన సిద్ధం గ్రామస్థాయి సభలో మేమూ సిద్ధమే అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్ చేశారు. ఇరుసుమండ, మొసపల్లి గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లను తొలగించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :