మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోద..
(శుభ తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: కే. నరేష్ యాదవ్)
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 20న ఓటర్ల నమోదుకు సంబంధించి పబ్లిక్ నోటీసు జారీ చేయనున్నారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6 వరకు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
అభ్యంతరాలకు డిసెంబర్ 10 వరకు అవకాశం
ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత అందులోని పేర్లపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించనున్నారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. వాటిని పరిశీలించి పరిష్కరించిన అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
పాత ఓటర్లు కూడా మళ్లీ నమోదు కావాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా సాధారణ ఓటర్ల జాబితాకు భిన్నంగా ఉంటుంది. అందువల్ల గతంలో పట్టభద్రుల ఓటరుగా నమోదైన వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల ప్రక్రియలో స్పష్టం చేశారు. తుది జాబితాలో పేరు ఉండటం ఓటు హక్కు వినియోగానికి కీలకం. ఎన్నికల సంఘం కూడా ఓటు వేయాలంటే సంబంధిత ఓటర్ల జాబితాలో పేరు ఉండాలని స్పష్టం చేస్తోంది.
మార్చితో ముగియనున్న ఎమ్మెల్సీల పదవీకాలం
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గం నుంచి సురభి వాణీదేవి, వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గం నుంచి తీన్మార్ మల్లన్న ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరి పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ముందుగానే ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది.












