బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ…..
(శుభ తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: కే. నరేష్ యాదవ్)
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
దానం నాగేందర్ 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2024 మార్చి 17న కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీ మారిన అంశంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
విచారణ అనంతరం అసెంబ్లీ స్పీకర్ గతంలో ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు పక్కనబెట్టింది. దానం నాగేందర్‌పై అనర్హత వర్తిస్తుందని పేర్కొంటూ ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి తెలియజేయాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది.
తీర్పుపై కేటీఆర్ స్పందన..
హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా “సత్యమేవ జయతే” అంటూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఇతర ఎమ్మెల్యేల విషయంలోనూ భవిష్యత్తులో ఇదే తరహా పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కౌశిక్‌రెడ్డి విమర్శలు..
హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుతో పార్టీ ఫిరాయింపుల అంశంపై న్యాయపరమైన పరిణామాలు స్పష్టమయ్యాయని ఆయన అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి పలు విమర్శలు చేసిన కౌశిక్‌రెడ్డి.. ప్రజల తీర్పును మార్చేలా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దానం నాగేందర్‌పై హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారింది. ఇక ఈ స్థానానికి సంబంధించిన తదుపరి ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.











