కాప్రా, ఆగస్టు 14 (శుభ తెలంగాణ/కాప్రా ప్రతినిధి/ ఎన్ ప్రవీణ్ కుమార్ ) కాప్రా సర్కిల్ పరిధిలో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లపై మురుగు నీరు నిలిచిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో దోమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాధిక–దమ్మాయిగూడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కాలనీలతో పాటు వినాయక్‌నగర్, హరిత ఎన్‌క్లేవ్, శ్రీ సాయినగర్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. వినాయక్‌నగర్ కమాన్ వద్ద మురుగు నీరు కుంటలా నిలిచిపోవడంతో పాదచారులు, మహిళలు, చిన్నారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ఎత్తు పెంచి మురుగు నీరు రోడ్డుపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












