తెలంగాణలో అత్యధికంగా కల్లు విక్రయాలు జరుగుతాయి. కల్లు అనేది పండుగల్లో సాకగా పరిగణిస్తారు. అమ్మవారి పూజల్లో ప్రధానంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటిల్లిపాది కల్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే అది చెట్టు కల్లు మాత్రమే. అలాంటి కల్లుకు మరింత ప్రాధాన్యమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కల్లు వృత్తికి గౌరవం తీసుకొస్తూ కొత్తగా ‘కల్లు బార్లు’ ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
మహబూబ్‌నగర్‌లో ఆదివారంలో ఏర్పాటుచేసిన గౌడ సంఘం సమ్మేళనంలో పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ‘త్వరలోనే కల్లు బార్లు ఏర్పాటు దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వివిధ కుల వృత్తులు కూడా మారుతున్నాయి. అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోంది. వాటితోపాటు గీత కార్మికుల వృత్తి కూడా మారాల్సి ఉంది. కల్లు గీత వృత్తిని ఆధునీకరించాల్సి ఉంది. కల్తీ కల్లు లేకుండా గౌరవప్రదంగా విక్రయించేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.
‘బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరి కల్లు బార్లు ఏర్పాటుచేయబోతున్నాం. అన్ని కుల వృత్తులను ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నాం’ అని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కల్తీ కల్లు నివారణ కోసం ధర ఎక్కువైనా పర్లేదు కానీ స్వచ్ఛమైన కల్లు విక్రయించేలా చేస్తామన్నారు. పెద్ద పెద్ద దావత్‌లలో కూడా ఖరీదైన మందు బాటిళ్ల పక్కన కల్లు ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకృతి నుంచి లభించే వస్తువును అంతే గౌరవప్రదంగా అమ్మేలా చేస్తానన్నారు. అన్ని కులవృత్తులకు అండగా ఉంటానని చెప్పారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఉచిత బస్సు పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులైంది. ఇప్పటివరకు 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు’ అని వివరించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.