టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి…
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, సెప్టెంబర్ 29 (శుభ తెలంగాణ ప్రతినిధి/ఎన్. ప్రవీణ్ కుమార్): జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి హెచ్చరించారు. మంగళవారం మల్లాపూర్‌లో ఉప్పల్ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోతే వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనలు ఆచరణలోకి రాలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇండ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ.. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా సంఘం కృషి చేసిందన్నారు. జర్నలిస్టులు ఐకమత్యంగా ఉంటేనే తమ సమస్యల పరిష్కారం కోసం సమర్థవంతంగా పోరాటం చేయగలమని పేర్కొన్నారు. జిల్లాలో అతిపెద్ద జర్నలిస్టు సంఘంగా టీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుంటుందని స్పష్టం చేశారు. జిల్లా కార్యదర్శి డి. వెంకట్ రామ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి. మల్కయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాంప్రసాద్ శర్మ, కేసీ మోహన్, పంజాల శ్రీనివాస్ గౌడ్, అక్బర్, ఆదిమూలం శ్రీనివాస్, రంగు మల్లేష్, రమేష్, జిల్లా హెల్త్ కమిటీ కన్వీనర్లు కొలనుపాక చంద్రమౌళి, విజయ్, టీయూడబ్ల్యూజే ఉప్పల్ నియోజకవర్గ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డి. సురేష్, ఉపాధ్యక్షులు రుద్రగోని నర్సింగ్, కోశాధికారి వేముల శంకర్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల తిరుపతిరెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జ్యోతిర్మయ చారి, ఉప్పల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వడ్డేపల్లి కిషోర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.











