కేటీఆర్‌తో పాటు అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, కిరణ్ మల్లేశ్వరరావు హాజరు.. రూ.55 కోట్ల నిధుల బదిలీపై ఏసీబీ అభ్యంతరాలు….
(శుభ తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: కే. నరేష్ యాదవ్)
ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, మాజీ హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, మాజీ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవెడ కిరణ్ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో హెచ్‌ఎండీఏ నిధుల నుంచి సుమారు రూ.55 కోట్లను ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే విదేశీ సంస్థకు బదిలీ చేయడంపై ఏసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అవసరమైన అనుమతులు తీసుకోకుండా, ఆర్థిక నిబంధనలు, నిర్దేశిత విధివిధానాలను పాటించకుండా నిధులు బదిలీ చేశారన్నది దర్యాప్తు సంస్థ ఆరోపణ.
ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు సమన్లు జారీ చేసింది. కేసులో కేటీఆర్‌ను ఏ1గా, అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా, కిరణ్ మల్లేశ్వరరావును ఏ4గా పేర్కొన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను కూడా కేసులో నిందితుల జాబితాలో చేర్చారు.
గత విచారణకు వ్యక్తిగత కారణాలతో కేటీఆర్ హాజరు కాలేదు. తాజాగా కోర్టు విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. అయితే కేసులోని కొందరు సహ నిందితులు హాజరుకాకపోవడంతో తదుపరి విచారణను అక్టోబర్ 30కి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.
కాగా, తనపై నమోదైన ఆరోపణలను కేటీఆర్ గతంలో ఖండించారు. కోర్టు ప్రక్రియపై తనకు నమ్మకం ఉందని, న్యాయస్థానం ఎప్పుడు హాజరు కావాలని ఆదేశిస్తే అప్పుడు హాజరవుతానని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఇంకా న్యాయపరమైన విచారణలోనే ఉన్నాయి.











